Skip to main content

విశాలాక్షి ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనవిజయం!!


          నెల్లూరు నగరంలోని టౌన్‌ హాల్‌లో అక్టోబరు 29, 2023 ఆదివారం సాయంకాలం అంగరంగవైభవంగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. కథ, కవిత, మినీ కథ, కార్టూన్‌ పోటీలలో విజేతలైన వంద మంది సాహితీకారులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సభకు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించారు. శ్రీ ఎమ్‌.వి. రామిరెడ్డి గారు, ప్రముఖ కవి, కథకులు, ఆత్మీయ అతిథిగా ప్రముఖ కథానవలా రచయిత్రి డాక్టర్‌ పెల్లకూరి జయప్రద సమావేశానికి విచ్చేసి అమూల్యమైన సందేశాన్నిచ్చారు.

          ఈ కార్యక్రమంలోనే డాక్టర్‌ పాలంకి రాధిక, విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్‌ గారికి, చలంచెర్ల భాస్కరరెడ్డి, తెలుగు బాషోద్యమ నాయకులకు విశాలాక్షి పురస్కారాన్ని అందజేసారు.

          కోసూరు రత్నం, విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపకులు, విశాలాక్షి మాసపత్రిక ప్రచురణకర్త సభను ప్రారంభించారు. వృద్ధుల ఆశ్రమం ఇరవై యేళ్ల క్రితం స్థాపించిన సందర్భాన్ని, అలాగే పదమూడేళ్ల క్రితం స్థాపించిన విశాలాక్షి మాసపత్రిక ప్రచురించే క్రమంలో తన ప్రయాణాన్ని సభికులకు చెప్పారు.

          సంపాదకులు ఈతకోటి సుబ్బారావు పత్రికా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని వివరిస్తూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా అప్రతిహతంగా విశాలాక్షి మాసపత్రికను పదమూడేళ్లుగా తీసుకువస్తోన్న సమిష్ఠి విజయం గురించి తన అనుభవాలను వివరించారు.

          ఆనాటి కార్యక్రమంలో వక్తలు అభిప్రాయాలను క్రోడీకరిస్తే ప్రతి మనిషికి ముఖ్యమైన రోజులు రెండు ఉంటాయని, ఆ క్రమంలో ఎవరి పుట్టినరోజైనా వారికి గొప్పదే అని, అది ప్రతి మనిషి గుర్తుపెట్టుకొనే ముఖ్యమైన రెండు రోజులలో ఒక రోజు అని అయితే ఆ పుట్టింది ఎందుకో తెలుసుకోవడం, అతి ప్రధానమైన రెండో రోజు అని అలా తన జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న కోసూరు రత్నం వృద్ధుల ఆశ్రమం పెట్టాలనే సంకల్పం కార్యరూపం దాల్చి ఎంతోమంది వృద్ధుల జీవితాలకు ఒక ఆసరాగా నిలుస్తోందని వ్యక్తులు అభిప్రాయపడ్డారు.

          అలాగే సాహితీకారులను గౌరవిస్తూ రకరకాల సాహితీ ప్రక్రియలకు పెద్దపీట వేస్తూ లాభాపేక్ష లేకుండా ఈతకోటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో విశాలాక్షి మాసపత్రిక ఉత్తమమైన సాహితీ విలువలతో ముందుకు సాగుతోందని సభకు విచ్చేసిన అతిథులు అభిప్రాయపడ్డారు.

          ఆనాటి సభలో ఎమ్‌.వి. రామిరెడ్డి గారు మంచి కథాలక్షణాలను సోదాహరణంగా వివరించారు. వారి ఉపన్యాసం ఔత్సాహిక రచయితులకే కాకుండా వర్ధమానులకు, లబ్దప్రతిష్ఠులైన రచయితలకు ఉపయుక్తంగా ఉంది. కథ గురించి వారు చెప్పిన కొన్ని విశేషాలు `

          ఆయన ఉపన్యాసం ప్రారంభంలో ఒక కథ గురించి చెప్పారు. ఆ కథలో డబ్భయ్‌ యేళ్ల వయస్సున్న ఒక పెద్దావిడ దాదాపు అరవై ఏళ్ల క్రితం తాను వదలేసిన పుట్టింటికి ఒకసారి వెళ్దామని కొడుకును అడుగుతుంది. అతడు ఆశ్చర్యపోతాడు.

          అరవై ఏళ్లుగా ఆమె పుట్టిన ఊరు అయిన పాల్‌ఘాట్‌తో ఆమెకు ఏ సంబంధాలు లేవు. ఆమె పుట్టింటివారు కూడా వారి ఇంటికి రారు. అందరినీ వదిలేసుకొని ప్రశాంతంగా బతికిన తల్లి మళ్లీ ఆ ఊరు ఎందుకు వెళ్దామనుకుందో కొడుక్కు అర్ధం కాదు. అయితే ఆ ఊరు నుంచి ఏ పరిస్థితుల్లో ఆమె బయట పడిరదో అర్ధం చేసుకున్న పాఠకులకు హృదయం ద్రవిస్తుంది. కారణం` ఆ పల్లెటూర్లోని చాలా మంది తమ దుర్భర దారిద్య్రం భరించలేక ఆడిపిల్లలను అమ్మేసుకుంటారు. ఆ విధంగా కథలోని డబ్భయ్‌ ఏళ్ల పెద్దావిడను ఒక వ్యక్తి కొనుక్కొని తీసుకొనివెళ్లి పెళ్ళి చేసుకుంటాడు. ఈ హృద్యమైన కథ పేరు ‘‘తెగిన పేగు’’. రాసినది పీసుపాటి ఉమా మహేశ్వరరావు.

          అలాగే రామిరెడ్డి గారు కేతు విశ్వనాథ రెడ్డి గారి ‘‘శృతి’’ కథ గురించి తులనాత్మక విశ్లేషణ చేసారు. శృతి అనే కథ ఒక రాగం గురించి కాదు, ఒక సంగీతానికి సంబంధించిన కథ కాదు. అది కార్మికుల ఉద్యమం గురించి. కుల మత వర్గ బేధాలు లేకుండా కార్మికులు తమ యజమానులను ఎదిరించే క్రమం శృతిశుభకంగా సమైక్య రాగంతో సాగాలనే సందేశం ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది.

          మంచి కథకు ప్రారంభం ఎలా ఉండాలో ఆయన వివరిస్తూ 1990 సం॥లో వాడ్రేవు చిన వీరభద్రుడు గారు రాసిన ‘‘సుజాత’’ కథ గురించి చెప్పారు.

          ‘ఆ లాకప్‌ రూమ్‌లో నా పై అత్యాచారం జరిగి ఏడాది కావస్తోంది’ ఇది మనసును మెళిపెట్టే ఆ కథలోని ముందు వాక్యం.

          అలాగే ముళ్లపూడి వెంకటరమణ గారి ‘‘కానుక’’ కథలో ప్రారంభం ఇలా ఉంటుంది.

          ‘పొద్దు వాటారినప్పటి నుంచి మర్రిచెట్ల లోంచి ఊడలు ఊడలుగా దిగజారుతున్న చీకటి, చెలమై చెలరేగిన యమునై భూమినంతా ముంచేసింది.’

          ఇలాంటి అద్భుతమైన ప్రారంభం ఉన్న ఈ కథలో రచయిత పరిపూర్ణత కోసం తపన పడే కళాకారుడి ఆర్తిని, అదే సమయంలో దేవుడికి సంపూర్ణంగా సాగిలపడే అతడి భక్తిని చిత్రించారు.

          రామిరెడ్డి గారు కథలో ఉన్న శైలి గురించి వర్ణిస్తూ ` కథలో శైలి కొబ్బరికాయలోనికి నీళ్లు చేరినట్టుగా చేరాలని సూచించారు. కథలో స్థలకాలాదులు చాలా ముఖ్యమని చెప్పారు. కృష్ణుడు` కుచేలుడు అటుకుల కథలో కాలం ఉంది. అతడు అడవిని జయించాడు కేశవరెడ్డి గారి కథలో అడవి నేపథ్యంగా సాగే స్థలం ఉంది.

          కథకు శీర్షిక చాలా ముఖ్యం అంటూ చిలుకూరి దేవపుత్ర గారి మన్ను తిన్న మనిషి, చక్రవేణు గారి కువైట్‌ సావిత్రమ్మ, శ్రీపాద వారి అరికాళ్ల కింద మంటలు, గొలుసు జగదీశ్వరరెడ్డి గజఈతరాలు, మధురాంతకం నరేంద్ర గారి నాలుగు కాళ్ల మండపం, మధురాంతకం రాజారాం గారి పొద్దు చాలని మనిషి, వేంపల్లి షరీఫ్‌ గారి ఒట్టి చెయ్యి కథలో పేర్కొన్నారు.

          చలం రాసిన ‘‘ఒక పువ్వు పూసింది’’ కథలోని ‘అర్థరాత్రి అడవిలో పువ్వు పూసింది. ఆ పువ్వు చుట్టూ ఉన్న ప్రకృతిని కొత్తగా వింతగా చూస్తుంది’ అంటూ అద్భుతమైన చలం శైలిని వర్ణించారు రామిరెడ్డి గారు. అలాగే కథకు ముగింపు ఏ విధంగా ఉండాలో కొన్ని ఉదాహరణలు ఇస్తూ రావిశాస్త్రిగారి ‘‘పిపీలకం’’ కథను పేర్కొన్నారు. ఇలా క్లుప్తంగా కథ గురించి రామిరెడ్డి గారి సమాలోచన వచ్చిన ప్రేక్షకులను అలరించింది.

          ఈ సమావేశంలో శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య గారి స్మారక కార్టూన్ల పోటీలోను, రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి శత జయంతి కవితల పోటీలోను, మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ కథల పోటీలోను, బ్రహ్మశ్రీ కడయింటి వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి చెంచులక్ష్మి స్మారక కథల పోటీలోను, శ్రీమతి గోవిందరాజుల సీతాదేవి స్మారక మినీ కథల పోటీలోను గెలుపొందిన విజేతలందరికి బహుమతి అందజేసారు. వచ్చిన అతిథులకు అమరావతి కృష్ణారెడ్డి గారు ఎప్పటిలాగే నెల్లూరు నగరంలో జరిగే  అన్ని సాహితీ సమావేశాలకు తన ఆతిథ్యం ఇచ్చిన విధంగానే ఆరోజు కార్యక్రమంలో కూడా వచ్చిన వారికందరికీ ఫలహారాలను, శీతల పానీయాలను అందజేసారు.

-డాక్టర్ ఎమ్ సుగుణరావు (రచయిత)

 

విశాలాక్షి వార్షికోత్సవ వేడుకలు:-

 
 
విశాలాక్షి వార్షికోత్సవ వేడుకల ఫోటోలు:-



























Comments

  1. ముద్రణా పత్రికలకి ఆదరణ తగ్గినా... వ్యయం అంతకంతకూ ఎక్కువై, అంతా అంతర్జాల పత్రికల వైపు అడుగులు వేస్తున్నా, మీరు ఒడిదుడుకులను అధిగమిస్తూ... వర్ధమాన రచయితలకు, రచయిత్రులను, కార్టూనిస్ట్ లకు పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తూ... వారిని ముందుకు తీసుకువెళుతున్నారు.
    విశాలాక్షి పత్రిక ఇలానే కలకాలం సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ అందరినీ ఆదరిస్తూ... శత దినోత్సవం జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    కోసూరు రత్నం గారు, ఈతకోట సుబ్బారావు గారి నిర్విరామ కృషికి నిదర్శనం విశాలాక్షీ మాసపత్రిక. రచయితగా నాకు మొదటి గుర్తింపును ఇచ్చిన, నా పుట్టినిల్లు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  బత్తుల బాపూజీ గారి ముఖచిత్రంతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చింది.  బుద్ధి యజ్ఞమూర్తి, అంగర వెంకట శివ ప్రసాద్,  శరత్ చంద్ర, మేడా మస్తాన్ రెడ్డి, దాసరి శివకుమారి, పి. ఉమాదేవి, గన్నవరపు నరసింహమూర్తిల కథలు...  డా.ఎన్.గోపి, అన్నవరం దేవేందర్ లతో పాటుగా మరో నలుగురి కవితలు...  బాలి బొమ్మకు కథలు...  అట్టాడ అప్పలనాయుడు, డా.కొత్వాలు అమరేంద్రలతో పాటుగా మరో ఆరుగురి సాహితీ వ్యాసాలూ...  కొమ్మవరపు విల్సన్ రావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ తగుళ్ల గోపాల్ తో చేసిన ప్రత్యేక ముఖాముఖి... ఇంకా మరెన్నో సాహితీ గుభాళింపులతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక అందుబాటులో ఉంది... 

సెప్టెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

సెప్టెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  ఆకట్టుకునే కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం,  బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో... 

జనవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది.  అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...